Saturday, November 15, 2014

స్ఫూర్తి నింపిన స్పుత్నిక్


తండ్రీ తనయుల మధ్య భావ వైరుధ్యం పురాణ కాలం నుండే నడుస్తోంది. హిరణ్యకశిపుడు ప్రహ్లదుల మధ్య దేవుడికి సంబంధించిన ఘర్షణ కూడా భావాల వైరుధ్యమే. తండ్రి చూపిన దారిని తానొవ్వక తన దారి చూసుకోవడం లాంటి కథలు కొత్తవేం కాదు.  ఈ ఇంట్రడక్షనంతా ఎందుకంటే మొన్న ఓ సినిమా చూశా అందుకే ఈ గోలంత. దాని గురించి గోరంత చెబుదాం అని అంతే. అక్టోబర్ స్కై అనే సినిమాలో ప్ర కృతి మనిషికీ మధ్య నున్న వైరుధ్యంతో పాటు తండ్రీ కొడుకుల మధ్య వైరాన్ని కూడా చూపించబడింది. 


స్థూలంగా కథ విషయానికొస్తే, 1957లలో కోల్ వుడ్ అనే ప్రాంత నేపథ్యంలో సాగుతుంది. ముఖ్యపాత్ర అయిన హోమర్ జాన్ ఓ కోల్ ఉద్యోగి కొడుకు హైస్కూల్ విద్యనభ్యసిస్తుంటాడు. ఆ ప్రాంతమంతా రష్యా నింగికి పంపిన స్పుత్నిక్ గురించి చర్చిస్తుంటారు. ఒక రోజు ఆ ప్రాంత ప్రజలంతా ఆకాశాన్ని చూస్తూ స్పుత్నిక్ కొరకై నిరీక్షిస్తుంటారు. అంతలో వెలుగు జిలుగులు విరజిమ్ముతూ నక్షత్రాలను చీల్చుకుంటూ స్పుత్నిక్ కనిపిస్తూంది. హోమర్ కూడా వారితో పాటు స్పుత్నిక్ను తిలకిస్తాడు. ఆ రోజు అతని జీవితంలో మరచిపోలేని రోజు. స్పుత్నిక్ను చూసిన క్షణం నుండి రాకెట్ను తయారు చేయాలనే కోరిక మొదలై ఎలాగైనా రాకెట్ ను తయారు చేసి నింగికి పంపాలని కంకణం కట్టుకుంటాడు. తనతో పాటు ముగ్గురు స్నేహితుల్ని చేర్చుకుని రాకెట్ తయారీలో నిమగ్నం అవుతాడు. అనేక సార్లు ప్రయత్నం చేస్తారు రాకెట్ ప్రయోగం సఫలీక్రుతం కాదు. అయితే ఊళ్లో ప్రచారం బాగా జరిగి వారి ప్రయోగలను వీక్షించడానికి ప్రజలు గుమిగూడతారు. రాకెట్ సఫలీక్రుతం కావడానిక ఊళ్లో వాళ్లు తాము తోచిన సహాయం చేస్తుంటారు. స్కూల్లో మిస్ రైలీ బాగా ప్రోత్సహిస్తూంది. కానీ, అతి ముఖ్యమైనది ఇంట్లో తండ్రి రూపంలో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. తన కొడుకు కూడా తనలా గనుల్లో పని చేయాలని ఆయన కోరిక. రాకెట్ తయారు చేసి పైకి(స్పేస్)కు వెళ్లాలని కొడుకు కోరిక. అనుకోకుండా తండ్రికి ప్రమాదం జరిగి కుటుంబ భారం మొత్తం హోమర్ పై పడుతుంది. తన చిరకాల కోరకైన రాకెట్ తయారీకి అంతటితో బ్రేకులు పడతుంది. బొగ్గు గనుల్లో కొత్త పని, రోజూ తెల్లవారుజామునే. ఒళ్లు హూనమయ్యేలా ఉంటుందా పని. ఇలా ఓ సంవత్సరం గడుస్తుంది. తండ్రి కి గాయాలు మానగానే తిరిగి పనిలోకెళ్తాడు. ఇంతలో ఓ విషాథ ఘటన. రాకెట్ తయారీలో తనను ప్రోత్సహించిన మిస్ రైలీ కు ప్రాణాంతక వ్యాథి సోకిందని తెలసి హతాశుడై ఆమెని కలవడానికి వెళ్తాడు. ఆ సమయంలో కూడా ఆమె అతనితో నీ జీవితం బొగ్గు గునులతో సమాప్తం కాకూడదనీ, నీవనుకున్నది సాధించాలనీ ప్రేరణనిస్తుంది. దాంతో  హోమర్ బొగ్గు పని ఆపి తిరిగి తన రాకెట్ తయారీను ప్రారంభిస్తాడు. అప్పుడప్పుడే కొడుకు ప్రయోజకుడయ్యాడని భావిస్తున్న తండ్రి ఆశలకు గండిపడుతుంది. అలా ఎన్నో అవరోధాలను, అడ్డంకులను అధిగమించి సైన్స్ ఫెయిర్లో ఆ ఏడాదికి బెస్ట్ అవార్డుగా తన రాకెట్ సాధించేలా చేసి కోల్ వుడ్ పేరు ప్రఖ్యాతి గాంచేలా చేస్తాడు. తండ్రికి కూడా తన కొడుకు సాధించింది తెలుసుకుని పులకిస్తాడు. తను తయారు చేసిన రాకెట్ ను తన మిస్ రెయిలీకి అంకితమివ్వడంతో సినిమా ముగుస్తుంది.
        నిజజీవిత అనుభవం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా  ఆకట్టుకుంటుంది. పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణానం ఉన్న అందమైన లొకేషన్లలో కోల్ ఉడ్ ప్రాంతాన్ని చిత్రీకరించారు. తండ్రీ కొడుకుల, తల్లీ కొడుకుల, స్నేహితుల  మధ్య భావోద్వేదాలు బాగా పండాయి. ఈ సినిమా పెద్దగా ప్రచారంలో లేదని నాకనిపించింది. చిన్నపిల్లల్లో(పెద్దలకు కూడా) సైన్స్ పట్ల ఆసక్తి కలిగించేందుకు, వారికి ప్రేరణ కలిగించేందుకు ఈ సినిమా సహాయం చేస్తుంది. సినిమాలోని నటీనటులందరూ తమ తమ పాత్రలలో ఒదిగి నటించారు. మొత్తానికి సినిమా చూసినవాళ్లైతే నిరాశకు గురవరు. మంచి సినిమా చూశామన్న ఫీల్ మాత్రం తప్పక పొందుతారు. మరి ఇంక ఆలస్యం ఎందుకు ఈ రోజే డౌన్లోడ్ చేసి చూశేయండి.

చదివిన వారికి ధన్యవాదాలు

No comments:

Post a Comment