Monday, July 28, 2014

వైవా సిత్రాలు


వైవా అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలియని వారు ఈ మధ్య అంతర్జాలంలో అంతరాయం లేకుండా ప్రదరిశంపబడుతున్నవైవా షార్ట్ ఫిల్మ్ చూసి మరీ తెలసుకునే ఉండి ఉంటారు. విద్యార్థులకు ఇదే అసలు సిసలైన పరీక్ష. రాత మరియు చూచిరాత పరీక్షలలో మాస్టార్లు, మేడంల సహకాంతో ఈజీగా పాస్ అయిపోయే వీరు వైవా దగ్గర మాత్రం వరల్డ్ కప్ ఫైనల్ లాస్ట్ బాల్ సిక్స్ టార్గెట్ ఉంటే ఎంత టెన్షన్ ఉంటుందో అంతకన్నా ఓ రెండు కిలోల ఎక్కువే టెన్షన్ పడుతుంటారు. వైవా అయిపోయిన తర్వతా మాత్రం మహాభారత యుద్ధాన్ని తామే నడిపించి ఆ భారాన్ని దించుకున్నంత రిలాక్స్ డ్ గా ఫీలైపోతుంటారు.
 
ప్రతి సెమిస్టర్ చివర్లో, రెండు రోజుల పాటు జరిగే  ఈ సినిమాను టిక్కెట్టు లేకుండా నేను చూడడం సంభవిస్తుంటుంది. వైవాకి సంబందించి విద్యర్థులు, ఉపాధ్యాయుల ఫీలింగ్స్ ను కొంత గమనించి ఇక్కడ రాయదలచుకొన్నాను. దీన్ని చదివేవారెవరూ హర్ట్ అవ్వద్దు ఎందుకంటే ఇది ఉద్దేశ్యపూర్వకంగానే రాసింది. ఇందులోని పాత్రలు సన్నివేశాలు కల్పితాలు కావు. యదార్ధమైనవే. అయితే పాత్రలకు పేర్లు లేవు.
          ఇక మొదలె పెడదాం......ముందుగా వైవా యొక్క ప్రాథాన్యతను ఇక్కడ కొంత వెల్లడిచేయవలసి ఉంది. వైవా అనేది ప్రాక్టికల్ పరీక్షలో ఒక భాగం మాత్రేమ. రాత పరీక్ష, ప్రాక్టికల్ నాలెడ్జి, వైవా, రికార్డులు మొదలగునవన్నీ కలుపుకుని ఆ విద్యార్థి యొక్క సామర్య్థాన్ని లెక్కగట్టి మార్కులు ఇవ్వడం అనేది అసలు ప్రక్రియ. అయితే నేడు అన్ని కాలేజీల్లో ఒక్క వైవా తప్ప మిగతా అంశాలన్నీ ఏదో తూతూమంత్ర కార్యక్రమంగా అటు విద్యర్థులు, ఇటు ఉపాధ్యాయులు నిర్వహిస్తున్నారు. వైవా మార్కుల బట్టే విద్యార్థి మెరుగైన వాడా కాడా అని తేల్చేస్తారు(కేవలం రెండు నిమిషాలలోనే...పాపం...ఏం చేద్దాం...) వైవాను నిర్వహించడానికి వేరొక కాలేజీ నుండి ఉపాధ్యాయులను అపాయింట్ చేస్తారు. పరీక్ష ప్రారంభైమనప్ఫటి నుండే విద్యార్థులు వైవా సార్ లేదా మేడం కోసం ఎదురుచూస్తుంటారు. యమలోకంలో యముడి రాకకై ఎదురుచూస్తున్న పాపాత్ముల వలె బిక్కుబిక్కు మంటూ బిగుసుకునిపోయి ఉంటారు. ఈ లోపుగా మా లోకల్ సార్లు లేదా మేడంలు(ఇంటర్నల్ గా పిలవబడే వారు) వారి పాపల చిట్టాలను (అదే ఆ సబ్జెక్టు తాలుకు రికార్డులను) ఒకసారి పరిశీలిస్తుంటారు. అసలు సమయానికంటే ఓ గంటే రెండు గంటలో మన యముడు(అదే వైవా నిర్వాహకుడు) విచ్చేస్తాడు. వారు వచ్చింది మొదలు ఆయన లేదా ఆమె ముఖాన్ని పదే పదే చూస్తూ వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేసే పనిలో పడతారు మన పాపాత్ములు( సారీ విద్యార్థులు). ఇక మన లోకల్ ఇంటర్నెల్ లు ఆయన వచ్చిన మరునిమిషం నుండే ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకై నానాతంటాలు పడుతుంటారు. ఆయనకు పురుగుమందులు(ఈ మధ్య వాటిని కూల్ డ్రింక్స్ అని కూడా అంటున్నారంటలే) కావాలా లేదా బిస్కత్తులు కావాలా, టీలు టిఫిన్లు కావాలా అంటూ పసివాడిని ముద్దు చేసినట్టు చేస్తుంటారు. ఇంక వైవా కార్యక్రమానికొస్తే మన యముడు పాత్రలు తోమినట్టు ఒక్కొక్కడిని ఒక్కో స్టైల్లో తోమేస్తుంటారు. ల్యాబ్ లోపల కొనసాగుతున్న ఈ క్రీడను మరొక బ్యాచ్ విద్యార్ధలు బైట నుండి ఆసక్తికరంగా తిలకిస్తుంటారు.
          మన స్టూడెంట్స్ విషయానికొస్తే ఖచ్చితంగా 80 శాతం మంది వైవాకు ప్రిపేర్ కాకుండానే వస్తారు. హా ఏదోకటి చెప్పకపోతామా అనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో బైట బీరాలు పలికే వారు లోపల కొచ్చి ఆ ఏదోకటి కూడా చెప్పలేక చతికిలబడిపోతుంటారు. ఒకడు దిక్కులు చూస్తే మరొకడు నీళ్లు నములుతాడు. ఇంకొకడు చెమటలు కారిస్తే(ఏసీ ఫుల్ గా ఉన్నప్పటికీ), మరొకడు కన్నీళ్లు కారుస్తాడు(అమ్మాయిలు ఈ అంశాన్ని బాగా వాడుతుంటారు).

 బహుశా ఆ ప్రశ్నకి జవాబు తెలిసే ఉం డి ఉండవచ్చుగాక లేదా తెలియకపోవచ్చును గాక కానీ కేవలం ఆ రెండు నిమిషాల్లో దాన్ని గురించి ఆలోచించి చెప్పాలంటే కష్టమే అనిపిస్తుంది మన విద్యార్థులకు. ఇంతకూ వైవా ఎంతకంటే కేవలం 10 మార్కులకే అయితే అది దాని పరిధి దాటి కేవలం వైవానే ఓ పరీక్షై కూర్చొంది. ఇలా కొనసాగుతూ ఉండే ప్రక్రియలో సదరు నిర్వాహకదారుడకు సకల శ్రేష్ఠమైన బావర్చీ బిర్యానీలు వచ్చి పడుతుంటాయి. ఆ వాసన వెంబడి పరిగెత్తి దాని అంతు తేల్చే కార్యక్రమంలో వైవాఓడు తలమునకలై ఉండే సమయంలో మన లోకల్ మాస్టార్లు లేదా మేడంలు ఇదే అదనుగా భావించి ఒక్కో విద్యార్థి దగ్గరకూ వెళ్లి ఒక రెండు తిట్లు చడామడా తిట్టి చేసింది చాల్లే ఇక వైవా కోసం కూసో అని వాళ్ల చేతిలోని పేపర్ల ను లాగేసుకుని వచ్చేస్తుంటారు. ఎక్కడ వాళ్లు ఎక్కువ సమయం కూర్చొని వీళ్లను కూడా కూర్చోబెడతారేమోనని కాబోలు. ఇక్కడొక ముఖ్యమైన విషయం ఏంటంటే పరీక్షకు ముందు సెమిస్టర్ అంతా వాడిన కంప్యూటర్లు వారికి ఆ రోజు అవి రోబోట్లా కనిపిస్తాయనుకుంటా. అన్ని విద్యలూ నేర్చిన కర్ణుడు ఆఖరి నిమిషంలో అస్త్రాల ఫార్ములాలు మర్చిపోయినట్టు కంప్యూటర్లు ఎలా స్విఛాన్ చేయాలన్న ప్రథమ సంగతిని సైతం మర్చిపోతుంటారు. ఇదంతా పాపం ఆ వైవామ్మ తల్ల పుణ్యమేననుకుంటా.

          ఇవన్నీ కొద్ది కాలంగా గమనిస్తూన్న నాకు ఒక వైపు వీరి చేష్టలు చూసి నవ్వొస్తున్నా మరొ వైపు మాత్రం ఈ తంతంతా ఎందుకబ్బా అని కూడా అనిపిస్తుంది. సెమిస్టర్ మొత్తం చదివిని సబ్జెక్టుకు సంబంధించి 2 నిమిషాలలో ఎలా అంచనా వేయగలరో నాకైతే అర్థం కాలేదు. ఒక్కోసారి ఏం జరుగుతుందంటే సెమిస్టర్ మొత్తం చదివి, రెగ్యలర్గా ల్యాబ్ కి వచ్చే విద్యార్ధులు ఆ రెండు నిమిషాల్లో తడబడి మార్కులు పోగొట్టుకోవడం అలాగే సెమిస్టర్లో ఏ ఒక్క పూటైనా ల్యాబ్కి గానీ క్లాస్కు గానీ రాని వాడు ఆ రెండు ప్రశ్నలు చెప్పి ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం లాంటి సంఘటనలు కూడా తరచుగా జరుగుతుంటాయి. ఇక మా మాస్టార్లైతే ఎప్పుడు ఈ వచ్చినోడు పోతాడా మనం పోదామా అని ఆలోచిస్తుంటారు. పాపం విద్యార్థులు పాపం పండి, ఉపాధ్యాయుల పుణ్యం పండి వారి మార్కలు నిర్ణేతలు వీరే కావడం వల్ల వీరెప్పుడూ వారికి దాసులై ఉండవలెను అనబడే కాన్సెప్టు వచ్చి పడింది. దీన్ని ఆసరా చేసుకొని ఏమీ రాని ఉత్తమోత్తములైన ఉపాధ్యాయులు విద్యార్థులను అణగదొక్కడం, సొంత పనులకు పురిగొల్పడం లాంటివి కూడా చేయిస్తున్నారు. ఏమైనా గానీ మన విద్యారంగంలోనే లోటుపాట్లు ఉన్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తూంది. చూద్దాం ఇలాంటి ఫ్యాక్టరీ చదువుల నుండి విద్యార్థులకు మోక్షం ఎప్పుడో.

No comments:

Post a Comment