Thursday, July 10, 2014

ర్యాగింగ్ రాక్షసులు


            
      అది దట్టమైన అడవుల మధ్య దిట్టంగా వెలసిన తిరుపతి నగరం, నగరం నుండి వెలివేసినట్లుగా ఉండే ఎస్వీ యూనివర్సిటీలోని ఓ హాస్టల్ రూంలో  ఓ 60, 70 మంది కాబోయే ఎంసిఏ గ్రాడ్యుయేట్లు సమావేశమై తీవ్రంగా చర్చిస్తున్నారు. సమయం చూసుకోలేదు పైగా వాచ్ పెట్టుకునే అలవాటు లేదు. అక్కడ కూర్చున్న వాళ్ల కళ్లల్లో కసి కట్టలు తెంచుకుంటుంది, రక్తంలో ఆమ్ల, క్షార ద్రవ పదార్థాలన్నీ అంటకట్టుకుని ప్రవహిస్తున్నట్టు అందరూ ఊగిపోతున్నారు. వారంతా ఏదో పార్టీ పెట్టేసి దేశాన్ని ఉద్దరించే కార్యక్రమమేమీ చేయడం లేదులెండి. టెన్షన్ పడొద్దు. వారు ర్యాగింగ్ రాక్షసులను అంతం చేసేందుకు సమావేశమయ్యారు. సమావేశం చివరలో అందరూ కలిసి ఓ డెసిషన్ తీసుకున్నారు. వచ్చే సంవత్సరం నుండి మేము మా జూనియర్స్ ను ర్యాగింగ్ చేయబోమనీ తద్వరా ఈ యూనివర్సిటీ నుండి ర్యాగింగ్ భూతాన్ని పారద్రోలేస్తామనీ తీర్మానం చేశారు. ఆ గుంపులో గోవిందలా నేను కూడా వారికి వంత పాడాను. సారీ చెప్పలేదు కదా నేను కూడా వారి గ్రూపు సభ్యుడినే.


ఫ్లాష్ బ్యాక్:
ఉత్తమోత్తమైన కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకోకపోయినా మా అమ్మ చేసిన ప్రార్థనల పుణ్యమో లేదా నా నైపుణ్యమో తెలీదు కానీ ఎంసీఎ చదవడానికి నాకు ఎస్వీ యూనివర్సిటీలో సీటొచ్చింది. అప్పటి వరకూ మా గుడివాడలోని కొన్ని గల్లీలు తప్ప వేరే ఎక్కడికీ పోని నేను కొన్ని జిల్లాలు దాటి చదువుకోసం వెళ్లవలసి వచ్చింది. సహజంగానే కొడుకు పై చదువుకు వెళ్తున్నప్పుడు అమ్మ  ఓ పావులీటరు అశ్రువులు భూమికి ధారపోసింది. అమ్మ ప్రేమకు అమెరికా అయిన చిత్తూరయినా ఒకటే కదా మరి అనుకుంటూ జాయిన్ కావడానికి మా పిత్రు దేవులతో కలసి తిరుపతికి పయనమయితిమి. కాలేజీలో జాయినింగ్ కార్యక్రమాలను పరిపూర్తి చేసుకుని హాస్టల్ కు వెడలితిమి. హాస్టల్ ఎంట్రన్స్ లో ఉన్న కుర్చీలో కూర్చొని మా నాన్న పేపర్ తిరగేస్తుంటే నేనో సారి హాస్టల్ను తిరగేద్దామని బయలుదేరా. హాస్టల్ కు 3 ఫ్లోర్లు ఉన్నాయి. ఫ్లోర్కు 30 గదులు టాయి. ఒక్కో గదికి 3గురు చొప్పున కేటాయించబడతారు. హాస్టల్ మధ్యలో ఆటలాడుకోవడానికన్నట్టు పేద్ద ఎంప్టీ ప్లేస్ కూడా ఉంది. అలా దాని మెజర్మెంట్స్, చుట్టుకొలతలు చూసుకుంటూ వెళ్తున్న నన్ను ఓ ఏడడుగుల బుల్లెట్ లాంటి మనిషి ఆపాడు. అంత పెద్ద మనిషి ఆపితే ఆగాలి కదా మరి ఆగా. వెంటనే నువ్వే బ్రాంచ్ రా అని గంభీరంగా అడిగాడు. సహజ యవ్వన పొగరుతో పుట్టి పెరిగిన నేను ఎంసీఏ అని అదే లెవెల్లో చెప్పాను. ఆయనకి ఎక్కడ కాలిందో నాకు కనిపించలేదు కానీ వెంటనే నా షర్ట్ జేబులోని ఉన్న వస్తువులన్నీ తీసి ఆయన జేబులో పడేశాడు. ఇదేంది పట్టపగలే సొమ్ము ఇలా కూడా దోచేసుకుంటారా అన్నా ప్లీజ్ ఇచ్చెయ్ అన్నా అని నేనన్నా. ఆయన రేయ్ అన్నా కాదు సార్ అనాలి, ఏ మనాలి సార్ అనాలి అని నాతో చెప్పించుకున్నాడు. ఇక ఆయనెవరనేది మీకిప్పటికే అర్థం అయి ఉంటుందనుకుంటా వారే మా గౌరవనీయులైన సీనియర్ సార్. పిల్లాడు దొరికాడు పిండేద్దాం అనుకున్నట్టున్నాడు చరిత్ర గమనంలో సీనియర్లు జూనియర్లకు పెట్టిన రూల్స్ పై నాకో ధీర్ఘోపాన్యాసం చేశాడు. ఈ హాస్టల్ అనబడే దేవాలయంలో వెలసిన సీనియర్లు అనబడే దేవుళ్లను ఎలా పూజించాలో, ఎలా మెలగాలో, ఎలా వారిని ప్రసన్నం చేసుకోవాలి అన్న అంశాలపై గుక్కదిప్పుకోకుండా ప్రసంగం దంచాడు. అందులోని రూల్స్ కొన్ని మీకోసం

1.     24 హవర్సూ మీరు(జూనియర్స్) ఇన్ షర్ట్ లోనే ఉండాలి.
2.    సీనియర్లు ఎక్కడ కనబడినా(అది కాలేజీ లేదా హాస్టల్, మెస్ చివరకు టాయిలెట్ అయినా) హలో సారూ అని విష్ చేయాలి
3.    పై జేబులో ఏమియునూ పెట్టుకోరాదు. పెట్టినచో అవి వారి చేత తస్కరించబడును
4.    కాలేజీ నుండి వచ్చాక ప్రతి సీనియర్ దేవుడు రూంకెళ్లి వారి చెప్పినది చేసి వారిని ప్రసన్నం చేసుకోవాలి
5.    వాళ్ల పేర్లు వాళ్లు(అంటే సీనియర్లు) చెప్పరంట అయిన మనమే తెలసుకోవాల్నట వగైరా వగైరా.......
ఇవన్నీ విన్న నాకు కళ్లు బైర్లు కమ్మాయి. మనసులో చింత మొదలయింది. గొంతులో తడారిపోయింది. ఎందుకిక్కడ జాయిన్ అయ్యామబ్బా అని కూడా అనుకున్నా వీళ్లతో 3 ఏళ్లు ఎలా కలిసుండాలా అన ఫ్యూఛర్ను ఓ సారి ఊహిస్తూ ఉండిపోయాను. ఓ రెండు కన్నీటి చుక్కలు కూడా కారవలసి ఉంది అయితే ఎందుకనో అవి కనురెప్పలు మధ్యను ఇరుక్కుపోయాయి. ఏయ్ ఈ చిన్న విషయానికే అంత ఫీలింగా అనుకోవచ్చు. ఎందుకింత బాధ కలిగిందంటే మనం చిన్నప్పటి నుండీ ఇంకోడిపై జోకులేసుకుని నవ్వుకునే టైపు తప్ప మన మీద జోకులేసి, శాసించేవారిని సహించేరకం కాదు కనుక.  అలా అబ్బనంగా పెరిగిన నాకు  ఈ అనుభవం చాలా బాధను కలిగించింది.  ఈ లోపున మరో 5 అడుగుల చాక్లెట్టు బాయ్లా మరో సీనియర్ దేవుడు ప్రత్యక్షమయ్యాడు. హమ్మయ్య ఈయన కొంచెం బెటరేమో అనుకుంటూండగానే రేయ్ ఇన్ ఏదిరా అంటూ ఎంట్రీ ఇచ్చాడు. ఇక నా బ్రతుకు సముద్రంలో తుఫు మధ్య చిక్కుకున్న చిన్న నావలా తయారయింది. ఇంతలో పేపర్ తిరగేయడం కంప్లీట్ చేసిన మా నాన్న నన్ను వెతుక్కుంటూ నా వైపు వస్తున్నాడు. అది చూసిన మా సీనయర్ ప్రభువులు ఆ రోజుకు నన్ననుగ్రహించి నా జేబులోని వస్తువులు వాపసు చేసి నవ్వుకుంటూ వెళ్లిపోయారు. బ్రేకుల్లేని బండిని బుల్డోజరు కాపాడినట్టు మా నాన్న నన్ను కాపాడాడు.
          ఇక అన్ని ఫార్మాలిటీలు అయిపోయి మా నాన్న బయలుదేరి వెళ్లిపోతున్నప్పుడు నా ఏడుపు చూసిన వారెవరైనా ఉంటే లాలిజో లాలిజో ఊరుకో పాపాయి పాటను ఖచ్చితంగా పాడేవారు. సెకండ్ ఫ్లోర్లోని ఓ రూంలో నా విడిది. అక్కడికి వెళ్లేసరికి నా రూంమేట్స్ అప్పటికే వచ్చి ఉన్నారు. వాళ్లతో పరిచయాలు పూరిత చేసి సర్థుడి కార్యక్రమం చేపట్టా. నా రూంమేట్స్ నాకంటే సీనియర్లు అంటే ఓ ఏడాది పాటు విశ్రాంతి తీసుకొని మరలా పరీక్ష రాసి జాయిన్ అయ్యారు. అయినా నాతో బానే కలిసిపోయారు. అందరూ బానే పరిచయం చేసుకుంటున్నా అందరిలోనూ ఒకే చింత అదే ఆ ర్యాగింగ్ రాక్షసి గురించే. జీవితంలో ఎప్పుడూ ఇన్ చేయని నేను అన్నీ చంపుకుని ఇన్ చేసుకుని మెస్ కెళ్లి భోంచేయడం, టాయిలెట్లకు కూడా ఇన్ షర్ట్లతోనే వెళ్లడం, వారెక్కడ కనిపించినా అరువు తెచ్చుకున్న నవ్వుతో పలకరించడం చాలా ఎబ్బెట్టుగా అనిపించేది. ఇవన్నీ తట్టుకోలేక రూంకొచ్చి ఏంటబ్బా ఈ బాధలు చదువుకుందామని వస్తే చావగొడుతుండ్రు అనుకొని ఏడ్వడం మొదలుపెట్టాను. ఇక డిన్నర్ తర్వాత దైవదర్శన కార్యక్రమం ఉంటుంది. తిరుమలలో దైవదర్శనానికి క్యూలో వెళ్లినట్టు మా వోళ్లంతా సీనియర్ల రూంల గడపల దగ్గర క్యూలో ర్యాగింగ్ చేయించుకోవడానికి వెయిట్ చేస్తుంటారు. మొదటిరోజు నేను కూడా వెళ్లకతప్పలేదు. ఒక్కో రూం కెళ్లి సార్లను విష్ చేయడం వారు పేరు చెప్పి శరణు కోరు అనడం పరిపాటి. ఓ రూంలో ఓ సారు నా బయోడేటా, హిస్టరీ, జాగ్రఫీ గురించి ఆరా తీస్తే మరో సారు వడు వచ్చి పాటెట్టి ఓ స్టెప్ వేయమండు. స్టెప్లు చూడ్డం తప్ప వేయడం రాదని ఎంత మొత్తుకున్నా వినరే చివరకు చెప్పీ చెప్పీ నాతో విసుగొచ్చి పంపించేసేవారు. మరొక రూంలో ఇన్ షర్ట్  ఎలా వేయాలి అనే అంశం పై ప్రాక్టికల్ కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారంలో చూపిస్తాడొకడు, మరొకడు సినిమా డైలాగ్లు చెప్పిస్తాడు. ఎవడైనా చెప్పినట్టు చేయకపోతే సంస్రకుత పద్యాలు(అధికార భాషలో వాటిని బూతులు అందురు) వదులుతారు. ఇలా ఓ 4 లేదా 5 రూంలు తిరిగేసరికి ఆ వేధింపులు తాళలేక ఎవరికీ కనిపించకుండా చెక్కేసి నారూంకొచ్చేసి లైట్లార్పేసి పడకేసేసేవాడిని. ఏ పన్నెండో, ఒంటిగంటకో మా రూం సోదరులు వచ్చి వారికి జరిగిన అనుభవాలు కథలు కథలుగా చెప్పుకుంటుంటారు. వారికి జరిగిన అవమానాలతో పోలిస్తే నాక్కొంచెం తక్కువే అని చెప్పాలి. చెప్పరాని సంగతులు చెప్పించారు, చెయ్యరాని పనులు చేయించారని చెప్పుకుని వారు బాధపడుతుంటే నేను కూడా వారి తరపున కొంత బాధపడ్డా. ఈ తతంగానికి మా సీనియర్ గాళ్లు(సారీ గాడ్లు) ఓ మాంచి పేరును కూడా తయారు చేశారు దాని పేరు ఇంటరాక్షన్ అట ఇంటరాగేషన్ లా ఉంది కదా పేరు. అయితే ప్రభుత్వం మాత్రం దీనికి పెట్టిన పేరు ర్యాగింగ్.  ఈ బాధలను తట్టుకోలేక రోజూ జరిగే దైవదర్శన కార్యక్రమానికి వెళ్లడం ఆపేశా. మీరెళ్లండి బైట లాక్ వేసేయండి నేను లోపల చీకట్లోనైనా ఉంటాను గానీ అక్కడకు మాత్రం రానని మా రూంమేట్స్ కి చెప్తే సరే నీఇష్టం దొరికితే మాత్రం డబుల్ డోస్ ఇస్తారని చెప్పి నాపై జాలితో వెళ్లిపోయేవారు. ఏమైనా గానీ ఆ సమయంలో కొంత నేను కూడా తెగించాను. నా అద్రుష్టం బాగుండి ఎవడూ నన్ను చూడలేదు. అలా ఓ 4 రోజులు గడచిపోయాయి. ఇంటి సిక్కు(అదే హోం సిక్కు) ఎక్కువయిపోయింది. ఎప్పుడెప్పుడు సెలవులొస్తాయా మా గుడివాడ కెళ్లిపోదామా అని చెప్పులకు చక్రాలు తగిలించుకొని రెడీగా ఉన్నాను.

          ఇంతలోనే ఆదివారం వచ్చింది. ఆదివారం అంటే అందరికీ ఇష్టమే. కానీ కొత్తగా జాయిన్ అయిన మాకు ఆ ఆదివారం మహాకష్టంగా గడిచింది. ఆ రోజు పొద్దున్నే 11 గంటలకే లేచి మా సీనియర్లు బ్యాట్లు, బాల్లు పట్టుకొని క్రికెట్ వేటకు అదే ఆటకు బయలుదేరారు. వస్తువులు బాగా బరువనిపించాయేమో తెలీదు గాని మా అందరినీ పిలిచి అవి పట్టుకోమని చెప్పి, పదండ్రా మనం ఈ రోజు క్రికెట్ ఆడదాం అని చెప్పారు. పోన్లే క్రికెట్ అయినా ఎంజాయ్ చేద్దాం ఆడనీయకపోయినా కనీసం చూడనిస్తారనే ఆశతో మా వాళ్లందరూ వాళ్లని ఫాలోఅయిపోయారు(నేను కూడా). ఇక చూడాలి నా సామిరంగా క్రికెట్ ర్యాగింగ్. కొత్తగా ఉంది కదా క్రికెట్ గేమ్లో కూడా ఎలా ర్యాగింగ్ చేస్తారో ఇంకొన్ని వాక్యాలలో మీరు తెలుసుకోబోతారు. మా అద్భుతమైన యూనివర్సిటీ ఎదురుగా ఓ మాంచి స్మశానం నెలకొని ఉంది. పర్లేదులే శవాలు కింద ఉంటాయి కదా మనం పైన క్రికెట్ ఆడుకోవచ్చులే ఏమీ డిస్టర్బ్ కావులే అని అనుకున్నారేమో ఏమో ఆ శ్మశానాన్నే స్మాల్ సైజ్ చిన్నస్వామి స్టేడియంగా మార్చేశారు. అనుకున్నట్టుగానే మమ్మల్ని మ్యాచ్లోకి తీసుకోలేదు. ప్రేక్షకుల్లా కూర్చోబెట్టారు. పోన్లే హ్యాపీగా మ్యాచ్ చూడొచ్చనుకున్నా. మ్యాచ్ స్టార్ట్ అయ్యిందో లేదో కనీసం ఒక్క బంతినైనా ఫీల్డ్ చేయని ఓ సీనియర్ ఓ ఫుల్ బాటిల్ (నీళ్లు) తాగేసి రేయ్ వాటర్ తీసుకురండ్రా అని మాలో ఒకడ్ని పురమాయించాడు. ఇంకొకడొచ్చి చాక్లెట్లు, జంతికలు, బబ్బుల్ గమ్లు, గుట్కాలు, సిగరెట్లు వగైర వగైర తెమ్మని చెప్పి మమ్మల్ని ఆ రోజుకు సర్వెంట్ల కింద మార్చేశారు. అసలు ట్విస్ట్ ఏంటంటే మా సీనియర్ ఎవడైనా ఫోర్ కొడితే వాడి టీం సభ్యుడొచ్చి ఏంట్రా క్లాప్స్ కొట్టరు మీరంతా ఆ టీం సపోర్టా చెప్తారా మీ సంగతి అని అనేసరికి మా వాళ్లందరూ టపాటపా క్లాప్స్ కొట్టడం మొదలుపెట్టారు. ఇది చూసిన వేరొక టీం సీనియర్ వచ్చి ఏంట్రోయ్ అంత ఆనందంగా ఉందా వాడు ఫోర్ కొడితే నైట్ మిమ్మల్ని సిక్స్లు కొడతాన్రా అని బెదిరించిపోయాడు. ఇంక చూడాలి టార్చర్ వాడు ఫోర్ కొట్టిన మేం క్లాప్స్ కొట్టలే, ఇంకోడు వికెట్ తీసినా అభినందించలేం. ఆ రోజు మా బాధ గుండెలు పిండే గేల్ కథ కన్నా ఎక్కువే. వాడిచ్చి ఎందుకు కొట్టలేదంటాడు వీడొచ్చి ఎందుకొట్టార్రా అంటాడు. ఆ మెంటల్ టార్చర్ తట్టుకోలేక అక్కడి నుండి ఉడాయిద్దామని చూసా గానీ సందు దొరకలేదు. ఆ రోజు క్రికెట్ మ్యాచ్లో బంతులతో పాటు మమ్మల్ని కూడా బాదేశారు వా వాళ్లు. అందుకే అదో బాడ్ సండే.

అలాంటి సంఘటనలు జరుగుతూనే ఓ వారం గడచిపోయింది. రెగ్యలర్ గా ర్యాగింగ్ కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. నన్ను నేను బందించుకొని ఆ రాక్షసుల పాలిట పడకుండా దాక్కుంటూనే ఉన్నాను. మరొక విషయం మరచాను. యూనివర్సిటీ గురించి నేను మచిలీపట్నం- తిరుపతి ఎక్స్ ప్రెస్లో ఊహించుకున్నవేవీ నిజాలు కావని కొద్ది రోజుల్లోని తేలిపోయింది. మా కొచ్చే మాష్టర్లు గురించి చెప్పాలంటే ఒక్కొకరికీ ఒక్కో వాల్యూం కేటాయించినా సరిపోదు. సింపుల్గా చెప్పాలంటే అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా చెప్పుకొనే వీళ్లకన్నా మా తోటి విద్యార్థులే సబ్జెక్టు బాగా చెప్పగలుగుతారు. అవును ఇది నిజం. యూనివర్సిటీల్లో ఇంతకు మించి ఏ మాత్రం ఉండదు ఇది నా స్వీయానుభవం. ఇక మా హెచ్ఓడి మేడం మొదటి రోజు వచ్చి ఆమె కింద శిక్ష పొందిన వారు సారీ శిక్షణ పొందిన వారు ఎలా తయారయ్యారో ప్రాక్టికల్గా చూపించింది ఎలాగంటారా మా కొచ్చే ప్రస్తుత మాస్టార్లు ఫ్లాష్ బ్యాక్లో ఆమె విద్యార్థులంట. ఆహా ఏమీ నా భాగ్యం ఇంతటి మహాపండితులు పురాణాల్లో కూడా లబించరు కదా నాకెలా లభించారు నేనెంత పుణ్యం చేసుకున్నాననుకుంటూ బెంచి మీద తల వాల్చి ఈసురోమంటూ మనసులో రోదిస్తుండగా మేడం ఆఖర్లో ఓ భారీ హెచ్చరిక జారీ చేసింది. అదేమిటంటే మీరిక్కడ  ఏ విద్యార్థి సంఘంలోనూ చేరరాదు, నిర్మించరాదు. చాల్లేవమ్మా మేమంతా ప్రొఫెషన్ ఇండివిడ్వువల్స్ ము మాకెవ్వరి బాధలూ పట్టవూ, మా సబ్జెక్టుల గోల, మా కెరీర్లు తప్ప. ఇక విద్యార్థి సంఘంలో చేరడమా? ఈవిడ అమాయకత్వం అనుకున్నా మనసులో. ఆమెందుకు ఆ మాటందో అసలు విద్యార్థి సంఘం ఏంటో విద్యార్థి సంఘాల కార్యక్రమాలేంటో నాకు తర్వాత బోదపడ్డాయి.
          ర్యాగింగ్ బాధలు తట్టుకొని తట్టుకొని డ్రైగా మారిన మా బ్రతుకుల్లోకి ఎడారిలో తుఫానులా ఒక ఆశ చిగురించింది. అప్పటికే ర్యాగింగ్ అవమానాలను భరించీ భరించీ కరుడుగట్టుకుపోయిన మా వాళ్లు పేలడానికి సిద్థమైన డైనమైట్లలా తయారయ్యారు. కానీ పైకి మాత్రం పేలని కడప బాంబులా కనిపిస్తున్నారు.  ఆ డైనమైట్ పేలే రోజు రానే వచ్చింది. ఆ రోజు ఏ రోజో సరిగ్గా గుర్తులేదు కానీ ఆ రోజు సంఘటన మాత్రం ఎప్పటికీ మర్చిపోలేం. ఆల్ ఆఫ్ ఎ సడెన్గా ఓ ఫ్లాష్ న్యూస్ దావానంలా హాస్టల్ అంతా వ్యాపించిపోయింది. అదేంటంటే ఎవరో మా క్లాస్మేట్ ఒకాయన ఛత్రపతి సినిమాలో విలన్ను ప్రభాస్ ఎదిరించినట్టు సీనియర్లను ఎదిరించాడని, ఆ వార్త విని  ఆ వీరుడ్ని ఒక్కసారి తనివితీరా చూడాలని అందరం కాంక్షించాం. ర్యాగింగ్ అవమానాలతో బండబారిన మా గుండెలు కుషన్ చైర్లలా మెత్తబడ్డ మినిట్ అది. అందరం ఒకేసారి కాకుండా ఒక్కొక్కరు ఒక్కోసారి వెళ్లి నాయక్ను కలసి వస్తున్నారు.  ఈ విషయం తెలుసుకున్న మా సీనియర్ దోరలు అరె మా బానిసలకు ఇంత ధైర్యం వచ్చిందే వీళ్లకొక మంచి గుణపాఠం చెప్పాలని నిశ్చయించుకొని మా నాయకుడ్ని అందరూ ఒకేసారి ర్యాగింగ్ చేయడానికి స్కెచ్ వేశారు. ఎలాగో విషయం తెలుసుకున్న మా నాయక్ నిరంతరం వార్తా స్రవంతి మీ, మన టీవి9కు ఓ ఫోన్ కొట్టి యూనివర్సిటీ అంతర్వవహారాలను అంతరాయం లేకుండా చెప్పేశాడు. ఆహా ఏమీ ఆ ధైర్యం, తెగింపు అనుకుంటూ లోపల బిక్కుబిక్కుమంటూ మా రూంలలో మేం అలాగే కూర్చొని తదుపరి సన్నివేశం కోసం ఎదురుచూచుచుంటుమి. మా నాయకుడైన రాజశేఖర్ని వారి రూంలలోకి పిలిపించుకుని సంస్ర్కత-తెలుగు-ఆంగ్ల వంగ తదితర భాషలన్నిటిలో వెలివేసిన పదాలన్నిటినీ వెతికి మరీ సందిస్తున్నారు. నిరంతర వార్తా స్రవంతి వారి వాహనం కొద్దిగా ఆలస్యం కావడం వలన మా నాయకుడు కొన్ని బూతుల ధనుర్భాణాలను ఎదుర్కొనవలసి వచ్చింది. మొత్తానికి మా సీనియర్లు  ఈ విషయాన్ని పసిగట్టి రాజశేఖర్ని రూంకి పంపి అందరూ తలుపులు గడియపెట్టి లోపల బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు అదే సమయంలో అప్పుడే స్వాతంత్ర్యం వచ్చిన దేశాల ప్రజల్లా మేమంతా బైటకొచ్చి స్వేచ్ఛా వాయువులను పీల్చాము. ఆ దినం నిజంగా మాకు స్వాతంత్రమనే చెప్పాలి.

          తర్వాతి రోజు పైన చెప్పిన మీటింగ్ జరిగింది. మేం 60 మందిమి పోగై రాజశేఖర్ రూంకి పోయాం. అతను ప్రసంగం స్టార్ట్ చేశాడు. మనమిలా ఎంత కాలం బిక్కు బిక్కు మంటూ ఏడవాలి. పదండి మనందరం కలసి మన హెడ్ దగ్గరకెళ్లి ఈ సమస్యపైన లెటర్ ఇచ్చి మన బాధలు చెపుదాం అన్నాడు. అవును కదా ఇంత కాలం మనం ఏడవకుండా  ఈ పని చేసినా బాగుండేది కదా అని అందరి బుర్రల్లో లైట్లు వెలిగాయి. ఏమైతేనేం ప్రస్తుతం సింహాల వలె వేటకు సిద్థమైన మన గ్రాడ్యుయేట్లు పరుగు పరుగున హెడ్ గుమ్మం వరకూ వెళ్లారు గానీ మన సింహాలు లోపలకు అడుగుపెట్టడానికి జంకాయి. అప్పుడ కూడా మన నాయకుడే చొరవ తీసుకొని  ఈ విషయాన్ని మేడంకి వెల్లడి చేశాడు. ఇక ఆ తర్వాత మేడం మా సీనియర్లు గూబగుయ్యిమనేలా ఛెడా మడా చీవాట్లు పెట్టేసరికి వారి ఇంటారేగేషన్ కార్యక్రమాలకు బ్రేక్ పడింది. అలా మా బ్యాచ్ నెం.2007-2010కి ర్యాగింగ్ బాధ తప్పింది. ఆనందంతో మనోళ్లు మళ్లా మీటింగ్ పెట్టి పైన చెప్పిన డెసిషన్ తీసుకున్నారు. ఆ రాజశేకరుడు విద్యార్థి సంఘం సభ్యుడని తర్వాత తెలిసింది. మొత్తానికి ఓ విద్యార్థి సంఘం దాని నాయకుడు పరమ నీచమైన ర్యాగింగ్ కార్యక్రమాన్ని మా యూనివర్సిటీల్లో నిలిపివేశారు.

2 comments:

  1. గర్ల్స్ హాస్టల్ లో కుడా ర్యాగింగ్ చేస్తారా , మీ ఫ్రెండ్స్ ( అమ్మాయిలు) ఉంటె కనుక్కొని చెప్పండి , మా అమ్మాయి కి svu pg లో సీటు వచ్చింది , కొంత ముందు జాగ్రత్త గ ఉండచ్చు

    ReplyDelete
    Replies
    1. ప్రస్తుతం కొంత తగ్గిందనుకోండి. టెక్నికల్ కోర్సలలో ఎక్కువ ఉంటుంది. ఎస్వీ ఫీజిలో ఏం ఎక్కువ ఉండకపోవచ్చు.

      Delete